Advertisement

ఆసిఫాబాద్: పెళ్లయిన రెండు నెలలకే తేజస్విని మృతి

TG CRIME: జాతీయ రహదారిపై ఉన్న గుంత ఓ నవవధువు ప్రాణాలను బలితీసుకుంది. వివాహమై రెండు నెలలు కాకముందే ఘోర రోడ్డు ప్రమాదంలో అధ్యాపకురాలు మృతిచెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసుల కథనం ప్రకారం.. బెల్లంపల్లి మండలం చాకెపల్లికి చెందిన తేజస్విని (27) సిర్పూర్‌(టి) సాంఘిక సంక్షేమ గురుకులంలో పార్ట్‌టైం రసాయనశాస్త్ర అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. కౌటాల మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తిరుపతితో ఈ ఏడాది జులై 5న ఆమెకు వివాహమైంది. పొలాల పండగ నిమిత్తం సొంత ఊరికి వెళ్లిన దంపతులు శనివారం ఉదయం ద్విచక్రవాహనంపై సిర్పూర్‌(టి) బయలుదేరారు. జన్కాపూర్‌ సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న గుంతను తప్పించే క్రమంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడిపోయింది.

ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న తేజస్విని తలకు తీవ్ర గాయమైంది. ఆమెను వెంటనే మంచిర్యాలలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. పెళ్లయిన రెండు నెలలకే కుమార్తె కన్నుమూయడంతో తల్లిదండ్రులు, భర్త రోదనలు మిన్నంటాయి

Advertisement
Advertisement