Advertisement

సూర్యాపేట: కాలువలో గల్లంతై ఇద్దరు విద్యార్థుల మృతి

TG CRIME: సెలవు రోజు స్నేహితులతో సరదాగా గడపాలనుకున్న ఆ బాలురకు అదే చివరి రోజు అయింది. ఈత సరదా ఇద్దరు నిండు ప్రాణాలను బలిగొన్న విషాద ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందపురం గ్రామంలో చోటుచేసుకుంది. ముక్త్యాల బ్రాంచ్ కెనాల్‌లో ఈత కొట్టేందుకు దిగిన ఇద్దరు తొమ్మిదవ తరగతి విద్యార్థులు గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ముకుందపురం, కోదాడ ప్రాంతాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండో శనివారం సెలవు కావడంతో కోదాడ పట్టణానికి చెందిన సాధిక హరీష్ నాయుడు (14), గుడిబండ గ్రామానికి చెందిన ఎలమర్తి లేక స్వరూప్ రెడ్డి (14) ముకుందపురం వచ్చారు. అక్కడ తమ స్నేహితుడు అనుదీప్‌ను కలిసి ముగ్గురూ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ వద్దకు వెళ్లారు. ముగ్గురూ ఈత కోసం కాలువలోకి దిగగా, కొద్దిసేపటికే నీటి ప్రవాహంలో హరీష్, స్వరూప్‌లు గల్లంతయ్యారు. మరో బాలుడిని స్థానికులు కాపాడారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో నీటిని తగ్గిస్తూ తీవ్ర ప్రయత్నాల అనంతరం ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు.

Advertisement

మృతుల్లో హరీష్ నాయుడు కోదాడకు చెందిన సాధిక కళ్యాణి ఒక్కగానొక్క కుమారుడు. రెండేళ్ల క్రితం హరీష్ తండ్రి గుండెపోటుతో మృతి చెందగా, ఇప్పుడు కొడుకు కూడా దూరం కావడంతో ఆ తల్లి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. స్వరూప్ రెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు మునగాల ఎస్సై సంజీవరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement