Advertisement

లక్నో: నెట్‌వర్క్ సమస్య.. జియో ఉద్యోగిని టవర్‌కు కట్టేసిన గ్రామస్థులు

లక్నో: మొబైల్ నెట్‌వర్క్ సరిగ్గా రాకపోవడంతో ఉత్తరప్రదేశ్‌లో గ్రామస్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏకంగా జియో కంపెనీ ఉద్యోగిని మొబైల్ టవర్‌కు తాళ్లతో కట్టేసి బందీగా ఉంచిన విచిత్ర ఘటన ఫతేపూర్ జిల్లా హర్దౌలీ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలో గత కొద్ది రోజులుగా జియో సిగ్నల్స్ అందక కాల్స్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై విసిగిపోయిన స్థానికులకు.. కంపెనీ పనులపై గ్రామానికి వచ్చిన ఓ ఉద్యోగి కనిపించడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అతడిని చుట్టుముట్టి సమీపంలోని మొబైల్ టవర్‌కు తాళ్లతో కట్టేశారు. నెట్‌వర్క్ సమస్యను పూర్తిగా పరిష్కరించేంత వరకు వదిలే ప్రసక్తే లేదంటూ తేల్చిచెప్పారు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని గ్రామస్థులతో చర్చలు జరిపారు. బందీగా ఉన్న ఉద్యోగిని సురక్షితంగా విడిపించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరమని నచ్చజెప్పి, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement