Advertisement

కుల సర్వే దేశానికే రోల్ మోడల్: మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే (కుల సర్వే) దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రాబోయే 2027 జాతీయ జనగణనలో బీసీ, ఓబీసీ కులగణనను తప్పనిసరిగా చేర్చాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన మంత్రి, రాష్ట్రంలో బీసీల జనాభాపై ప్రభుత్వం వద్ద అత్యంత ప్రామాణికమైన, కచ్చితమైన గణాంకాలు ఉన్నాయని తెలిపారు. స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. సుప్రీంకోర్టు విధించిన 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని దాటాలంటే సైంటిఫిక్ కుల గణాంకాలు ఎంతో అవసరమని, రాష్ట్రంలో నిర్వహించిన సర్వే దానికి బలమైన ప్రాతిపదికగా నిలుస్తుందని వివరించారు.

దేశవ్యాప్త జనగణనలో బీసీ, ఓబీసీ వివరాలను స్పష్టంగా నమోదు చేసి, జనాభా ప్రాతిపదికన పూర్తి న్యాయం చేయాలని కోరారు. “బీసీల జనాభాను సరిగ్గా లెక్కించండి.. వారికి తగినంత న్యాయం చేయండి” అని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సామాజిక న్యాయం సాధించాలన్న లక్ష్యంతోనే తమ ప్రభుత్వం కుల సర్వేను విజయవంతంగా పూర్తి చేసిందని, కేంద్రం కూడా ఇదే బాటలో నడవాలని పొన్నం ప్రభాకర్ కోరారు.

Advertisement
Advertisement