Advertisement

గద్వాల: ప్రేమ వివాహం.. యువకుడి ఇల్లు ధ్వంసం

TG: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల రూరల్ మండలం రేపల్లి గ్రామంలో కులాంతర ప్రేమ వివాహం ఉద్రిక్తతకు దారితీసింది. వేరే కులానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుందన్న కక్షతో యువతి కుటుంబసభ్యులు అతని ఇంటిని కూల్చివేశారు. గ్రామానికి చెందిన రంగముని (26), మహేశ్వరి (21) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. బుధవారం వీరు వివాహం చేసుకుని రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరువర్గాలను పిలిపించి మాట్లాడగా.. తాను మేజరని, ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని, భర్తతోనే ఉంటానని మహేశ్వరి తేల్చిచెప్పింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యువతి కుటుంబసభ్యులు, కులస్థులు గ్రామానికి వెళ్లి ట్రాక్టర్లు, గడ్డపారలతో రంగముని ఇంటిని కూల్చివేశారు. అంతేకాకుండా, అదే ప్రాంగణంలో ఉన్న రంగముని చిన్నాన్న ఇంటిని కూడా జేసీబీలు, ట్రాక్టర్లతో నేలమట్టం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement