Advertisement

గద్వాల: కోడలి తలపై గొడ్డలితో నరికిన మామ

TG CRIME: ప్రశ్నించిన కోడలిపై సొంత మామ గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన దారుణ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని చాగదోణ గ్రామంలో చోటుచేసుకుంది. గట్టు ఎస్సై శేఖర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. చాగదోణ గ్రామానికి చెందిన జాన్‌కు, కర్ణాటక రాష్ట్రంలోని ఎరిగేరకు చెందిన రీటాతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. అయితే పెళ్లై ఇన్నాళ్లయినా పిల్లలు కలగలేదనే నెపంతో మామ కొయ్య తిమ్మప్ప తరచూ కోడలు రీటాను వేధించేవాడు. బెదిరింపులకు తాళలేక రీటా రెండేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లగా.. పెద్దమనుషులు పంచాయతీ చేసి ఆమెను తిరిగి కాపురానికి పంపించారు.

తాజాగా కొడుకు, కోడలిని ఇటుక బట్టీ పనికి పంపిస్తానని చెప్పి తిమ్మప్ప రూ.1,00,000 అడ్వాన్స్ తీసుకున్నాడు. ఆ డబ్బుతో పనికి వెళ్లకుండా తాగుడుకు అలవాటుపడి జల్సాలు చేస్తుండటాన్ని కోడలు రీటా నిలదీసింది. తనను ప్రశ్నించిందన్న కక్షతో ఊగిపోయిన తిమ్మప్ప, ఇంట్లోని గొడ్డలితో రీటా తలపై బలంగా నరికాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రీటాను కుటుంబ సభ్యులు వెంటనే అయిజ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి వాంగ్మూలం మేరకు నిందితుడు తిమ్మప్పపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement