Advertisement

ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన.. డ్రోన్ల వినియోగంపై పోలీసుల నిషేధం

మన పత్రిక, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ మే 10న హైదరాబాద్‌లో పర్యటించనున్న నేపథ్యంలో నగర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా మాదాపూర్, బేగంపేట్, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి ప్రాంతాల్లో డ్రోన్లు, పారా గ్లైడర్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల వినియోగంపై సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసులు వేర్వేరుగా నిషేధం విధించారు.

హైటెక్ సిటీలో నూతనంగా నిర్మించిన సింధు ఆస్పత్రిని ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం రూ.9,400 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. వీటిలో జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, వరంగల్ పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్క్, జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే, విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి.

Advertisement

బేగంపేట్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభకు రెండు లక్షల మందిని సమీకరించేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. ఈ సభ ఏర్పాట్లపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కాగా, నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే భారతీయ నాగరిక సురక్ష సంహిత సెక్షన్ 163 కింద కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

Advertisement