Advertisement

టీజీఆర్‌ఈడీసీఓ డిప్యూటీ ఇంజినీర్ ఆస్తులపై ఏసీబీ మెరుపు దాడులు

మన పత్రిక, పాల్వంచ: తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు టీజీఆర్‌ఈడీసీఓ (TGREDCO) డిప్యూటీ ఇంజినీర్ ముత్యం వెంకటరమణకు సంబంధించిన ఆస్తులపై బుధవారం విస్తృత స్థాయిలో సోదాలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పది ప్రాంతాల్లో ఒకేసారి ఈ దాడులు జరిగాయి. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని రాహుల్ గాంధీ నగర్‌లో ఉన్న ఆయన బంధువుల నివాసాల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి.

ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు ఉదయం నుంచే ఈ సోదాలను ప్రారంభించాయి. హైదరాబాద్ మాధాపూర్‌లోని అధికారిక నివాసంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడి, కాంట్రాక్టు పనుల్లో కమిషన్లు వసూలు చేయడం ద్వారా ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు వెంకటరమణపై ఆరోపణలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ సోదాల్లో భూములు, గృహాలు, బ్యాంకు డిపాజిట్లు, పెట్టుబడులకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. సోదాలు పూర్తయిన తర్వాత స్వాధీనం చేసుకున్న ఆధారాలను విశ్లేషించి తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అధికార వర్గాలు వెల్లడించాయి.

Advertisement
Advertisement