Advertisement

తెలంగాణలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల గుత్తాధిపత్యం: కేంద్రం సీరియస్

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల మాఫియా రోజురోజుకూ విస్తరిస్తూ దేశ భద్రతకే ముప్పుగా మారుతోంది. కేవలం రూ. 100తో లక్షలు సంపాదించవచ్చని ఆశ చూపే ఈ యాప్‌లు, సామాన్యులను ఉచ్చులో బిగించి వారి జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఫన్‌ 88 వంటి చైనా మూలాలున్న యాప్‌లు విదేశీ సర్వర్లు, వీపీఎన్‌ల సాయంతో చట్టాలను తప్పించుకుంటూ కార్యకలాపాలు సాగిస్తున్నాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గుర్తించింది. వీటి వెనుక ఉన్న ఆర్థిక మూలాలను కత్తిరించేందుకు కేంద్రం ఆపరేషన్ ప్రారంభించినట్లు సమాచారం.

కుటుంబాలను కూల్చుతున్న బెట్టింగ్ ఉచ్చు

తెలంగాణ ప్రభుత్వం 2017లోనే గేమింగ్ చట్టానికి సవరణలు చేసి ఇలాంటి యాప్‌లను నిషేధించినప్పటికీ, వీటి ప్రభావం తగ్గడం లేదు. హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రూ. 30 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకోవడం, వరంగల్‌లో ఒక విద్యార్థి తన తండ్రి రిటైర్మెంట్ డబ్బును కోల్పోవడం వంటి ఘటనలు ఈ బెట్టింగ్ తీవ్రతకు అద్దం పడుతున్నాయి. డబ్బుతో పాటు, వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Advertisement

చైనా లింకులు మరియు సెలబ్రిటీల ప్రచారం

భారత్‌లో బెట్టింగ్ ద్వారా వసూలవుతున్న సొమ్మును క్రిప్టో కరెన్సీ లేదా బోగస్ కంపెనీల ద్వారా హవాలా మార్గంలో చైనాకు తరలించి, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వాడుతున్నట్లు కేంద్ర హోం శాఖ విచారణలో తేలింది. అందుకే కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఫన్‌ 88 సహా 230కి పైగా చైనా అనుబంధ యాప్‌లను బ్లాక్ చేయాలని ఆదేశించింది. మరోవైపు, స్టార్ హీరోల ఫొటోలు, పాత వీడియోలను వాడుకుని ప్రచారం చేస్తున్న ఈ యాప్‌ల తీరుపై పోలీసులు నిఘా పెట్టారు. నిషేధిత యాప్‌లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, ఫోన్లలో ఉన్న ఇలాంటి యాప్‌లను వెంటనే తొలగించాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ వి.అరవింద్‌బాబు సూచించారు.

Advertisement