Advertisement

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజులు వర్షాలు

అమరావతి: ఉత్తర బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు ఉత్తరాంధ్రతో పాటు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని, మిగతా చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపింది. వర్షాల సమయంలో ఉరుములు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చెట్లు, భారీ హోర్డింగ్‌ల కింద ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడవద్దని హెచ్చరించింది.

Advertisement