Advertisement

కామారెడ్డి జిల్లాలో పాత నాణేల పేరుతో రూ.64 వేల సైబర్ మోసం

మన పత్రిక, కామారెడ్డి: సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలను నమ్మి కామారెడ్డి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి రూ.64 వేలు నష్టపోయారు. పాత నాణేలు, నోట్లకు అధిక ధర ఇస్తామని నమ్మబలికిన సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి బాధితుడు మోసపోయారు.

మోసం జరిగిందిలా..

మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామానికి చెందిన బెల్లపు కొమురయ్య ఫేస్‌బుక్‌లో పాత నాణేలు, నోట్లను కొనుగోలు చేస్తామనే ప్రకటనను చూశారు. ఆ ప్రకటనలో ఉన్న నంబర్‌కు సంప్రదించగా, అధిక లాభాలు వస్తాయని నేరస్థులు నమ్మించారు. వివిధ బ్యాంక్ ఖాతాలు, క్యూఆర్ కోడ్‌ల ద్వారా దశలవారీగా రూ.64 వేలను బాధితుడి నుంచి వసూలు చేశారు. మరింత డబ్బు కోసం నిందితులు ఒత్తిడి చేయడంతో, తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే 1930 జాతీయ సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు.

Advertisement

పోలీసుల హెచ్చరిక

ఈ ఘటనపై ఎస్సై అనిల్ మాట్లాడుతూ, మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే అధిక లాభాల ఆశ చూపే ప్రకటనలను నమ్మవద్దని, తెలియని వ్యక్తులకు డబ్బులు పంపవద్దని ప్రజలను ఆయన కోరారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

Advertisement