మన పత్రిక వెబ్‌డెస్క్: ‘కాంతార’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటి సప్తమి గౌడ తాజాగా ఒక సామాజిక అంశంపై గళం విప్పారు. సినిమా ఫంక్షన్లు, పబ్లిక్ ఈవెంట్లలో ఫోటోగ్రాఫర్లు, కెమెరా ఆపరేటర్లు హీరోయిన్ల పట్ల వ్యవహరిస్తున్న తీరును ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సుదీర్ఘమైన పోస్ట్ షేర్ చేస్తూ అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
ఇది ఇండస్ట్రీలోని హీరోయిన్లు, ఇతర నటీమణులందరూ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అని సప్తమి ఆవేదన వ్యక్తం చేశారు. పబ్లిక్ ఈవెంట్లలో తమ పనిని కాకుండా, తమ శరీర భాగాలపై అసంబద్ధంగా జూమ్ చేస్తూ ఫోటోలు, వీడియోలు తీస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇది చాలా అసౌకర్యంగా ఉండటమే కాకుండా.. మమ్మల్ని అవమానించడమే అవుతుందని, కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఇటువంటి పనులు ఏమాత్రం సహించరానివని ఆమె స్పష్టం చేశారు.
చిత్ర పరిశ్రమలోని మహిళలందరి తరపున తాను ఈ విషయాన్ని మాట్లాడుతున్నానని ఆమె చెప్పారు. తాము ఇండస్ట్రీలో ఉన్నది తమ వృత్తి, నటన కోసమని, ఇలా హద్దులు దాటి ప్రవర్తించడం ఏమాత్రం సభ్యత అనిపించుకోదని వ్యాఖ్యానించారు. మీడియా మిత్రులు ప్రొఫెషనలిజం పాటించాలని, కనీస గౌరవం ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దీనికి ‘నటీనటులం.. వస్తువులం కాదు’ (Actors not objects) అనే క్యాప్షన్‌ను జతచేశారు.
అయితే, ఈ సమస్య ఇప్పటిది కాదని బాలీవుడ్ తారలు జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, నోరా ఫతేహి వంటి వారు కూడా పాపరాజీల తీరును గతంలోనే తప్పుబట్టారు. డ్రెస్సులను, నడకను అసభ్యకరంగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో వ్యూస్ కోసం వాడుకోవడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా సప్తమి గౌడ ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తేవడంతో నెటిజన్ల నుంచి ఆమెకు విశేష మద్దతు లభిస్తోంది. సప్తమి గౌడ ఇటీవల ‘ది రైజ్ ఆఫ్ అశోక’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
