Advertisement

నా మాటలను వెనక్కి తీసుకుంటున్నా: MLC తాతా మధు

తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. అసెంబ్లీ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్న సమయంలో ఆయన స్పీకర్‌ను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఈ వివాదం ముప్పేట దాడిలా మారుతుండటంతో తాతా మధు స్పందించాల్సి వచ్చింది. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు.

తాను స్పీకర్‌ను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు అనలేదని, ఆయనపై తనకు పూర్తి గౌరవం, మర్యాద ఉన్నాయని స్పష్టం చేశారు. అసెంబ్లీ గేట్ వద్ద పోలీసులు తనపై దాడి చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేశారని, ఆ సమయంలో తాను తీవ్ర ఆవేదనకు గురయ్యానని తెలిపారు. అయినప్పటికీ తాను స్పీకర్‌ను ఏమాత్రం కించపరచలేదన్నారు. ఒకవేళ తన మాటలు స్పీకర్‌ను ఉద్దేశించినట్లు భావిస్తే, ఆ మాటలను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నానని ప్రకటించారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

అయినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిగణించింది. వర్షాకాల సమావేశాల తొలి రోజు బ్లాక్ టీ-షర్టులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ సభ్యులను పోలీసులు అడ్డుకోగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ‘ఎవడ్రా స్పీకర్.. మీకు అధికారం ఎవడిచ్చారు’ అంటూ తాతా మధు ఏకవచనంతో సంబోధించారని కాంగ్రెస్ ఆరోపించింది. దళిత సామాజిక వర్గానికి చెందిన స్పీకర్‌ను అవమానించడమేనని మండిపడింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు సభలో ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాతా మధును ఎమ్మెల్సీగా తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాజకీయ వేడిని రాజేశారు.

Advertisement