మన పత్రిక, క్రైం: హైదరాబాద్ నగరంలో మరో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి, సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని ఏకంగా రూ.2.36 కోట్లు కోల్పోయిన ఘటన కలకలం రేపుతోంది. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ మోసం గతేడాది ఆగస్టులో ప్రారంభమైంది.
హైదరాబాద్‌కు చెందిన వీరభద్రరావు అనే సాఫ్ట్వేర్ ఉద్యోగికి ‘కోరా’ అనే పేరుతో Facebookలో ఒక గుర్తుతెలియని మహిళ పరిచయమైంది. తాను సింగపూర్‌కు చెందినదానినని, ప్రస్తుతం ముంబయిలో పనిచేస్తున్నానని చెప్పి అతనితో స్నేహం పెంచుకుంది. కొద్ది రోజుల్లోనే చాటింగ్ ద్వారా అతనితో చనువు పెంచుకుని, తాను ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటున్నానని నమ్మబలికింది. ఈ క్రమంలో ‘ఫేస్బుక్ స్టోర్’ పేరుతో ఒక గ్రూప్‌లో అతడిని చేర్చి, అందులో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని ఆశ చూపింది. తొలుత నిరాకరించిన వీరభద్రరావు, ఆమె నిరంతర ప్రలోభాలకు లోనై చివరికి పెట్టుబడి పెట్టేందుకు ఒప్పుకున్నాడు. అనంతరం ఆమె ఒక APK ఫైల్ పంపగా, దానిని డౌన్లోడ్ చేయగానే ఫేస్బుక్ తరహాలో కనిపించే నకిలీ ట్రేడింగ్ యాప్ ఫోన్లో ఇన్స్టాల్ అయింది.
ఇంకా ‘బెల్లా’ అనే మరో మహిళను పరిచయం చేసి, ఆమె సలహాలతో వ్యాపారం చేయాలని సూచించారు. ఆ యాప్‌లో వస్తువులు కొనుగోలు చేసి తిరిగి అమ్మితే లాభాలు వస్తాయని నమ్మబలికారు. ఈ నమ్మకంతో వీరభద్రరావు సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 12 మధ్య కాలంలో పలు విడతలుగా క్రిప్టో వాలెట్ ద్వారా మొత్తం రూ.2.36 కోట్లను బదిలీ చేశాడు. యాప్‌లో లాభాలు చూపించినప్పటికీ, అసలు డబ్బు మాత్రం ఉపసంహరించుకోలేకపోయాడు. తర్వాత నిందితురాలు స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, ఈ మొత్తం విదేశీ ఖాతాలకు, క్రిప్టో కరెన్సీ రూపంలోకి మారిపోయినట్లు గుర్తించారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తి కూడా ఇలాంటి మోసానికి గురవ్వడం ఆందోళన కలిగిస్తోంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- వైసీపీ నేతతో వేదిక పంచుకున్న బొండా ఉమపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
- విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన విజయవాడ దంపతులపై హైదరాబాద్‌లో కేసు నమోదు
- రేపటి నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభం
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రహ్లాద్ జోషి
