Advertisement

HYD: అసెంబ్లీలో కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలి రోజే తీవ్ర ఉద్రిక్తత, భావోద్వేగ వాతావరణం చోటుచేసుకుంది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ బ్లాక్ టీ-షర్టులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ సభ్యులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌ను, ఆయన తల్లిని అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపణలు వచ్చాయి.

ఈ ఘటనపై అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి సీతక్క తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టుకున్నారు. దళిత స్పీకర్‌ను అవమానించడం వెనక కేసీఆర్ ఉన్నారని, దళితులు స్పీకర్ స్థానంలో ఉండటం బీఆర్ఎస్ నాయకత్వానికి నచ్చడం లేదని మండిపడ్డారు. సీతక్క ఏడవడంతో చైర్‌లో ఉన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. ఈ ఘటనతో సభలో నిశబ్ద వాతావరణం నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం సభ్యులు స్పీకర్‌కు సంఘీభావం తెలిపారు. తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేసి, ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement