Advertisement

నర్సాపూర్‌లో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

మన పత్రిక, నర్సాపూర్: నర్సాపూర్ పట్టణ సమీపంలోని బీవీఆర్ఐటీ కళాశాలలో ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న మేతిపోలే శివశంకర్ (20) ఆత్మహత్య చేసుకున్నాడు. అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం లింగోజి తండాకు చెందిన శివశంకర్, తన స్నేహితులతో కలిసి పట్టణంలోని సిటీ ప్యాలెస్ వద్ద అద్దె గదిలో ఉంటున్నాడు. మంగళవారం స్నేహితులు లేని సమయంలో అతను ఫ్యాన్‌కు నైలాన్ తాడుతో ఉరి వేసుకున్నాడు.

ఈ ఘటనపై ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి వివరాలు వెల్లడించారు. మృతి చెందడానికి ముందు శివశంకర్ తన స్నేహితుడికి ఇన్‌స్టాగ్రామ్‌లో సూసైడ్ నోట్ పంపాడు. అందులో తన అవయవాలు పనిచేస్తే అవసరమైన వారికి దానం చేయాలని, మరణిస్తే తన శరీరాన్ని శాస్త్రీయ పరిశోధనల కోసం విరాళంగా ఇవ్వాలని కోరాడు. చాలా కాలంగా తాను చనిపోవాలని ప్రయత్నిస్తున్నానని, తన తల్లిదండ్రులు తనకు పూర్తి మద్దతు ఇచ్చారని ఆ నోట్‌లో పేర్కొన్నాడు. మృతుడి తండ్రి గంగాధర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement