Advertisement

ఏలూరులో చైన్ స్నాచర్ అరెస్ట్, బంగారు ఆభరణం స్వాధీనం

మన పత్రిక, ఏలూరు: ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రు వంతెన సమీపంలో వృద్ధ మహిళ మెడలో నుండి సుమారు రూ. లక్ష విలువైన బంగారు నానుత్రాడును దొంగిలించిన నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. చేపలు విక్రయిస్తున్న వృద్ధురాలి వద్ద చేపలు కొంటున్నట్లుగా నటించి, ఆమె మెడలోని బంగారు ఆభరణాన్ని లాక్కొని నిందితుడు పరారయ్యాడు.

జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్ ఆదేశాల మేరకు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణ, ఎస్‌ఐ వి. వెంకటేశ్వరరావు నేతృత్వంలోని బృందం నిందితుడి కోసం గాలింపు చేపట్టింది. ఈ క్రమంలో మండవల్లి మండలం భైరవపట్నానికి చెందిన గొల్లు నాగ కార్తీక్ (25)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి చోరీకి గురైన బంగారు నానుత్రాడుతో పాటు, నేరానికి ఉపయోగించిన హీరో ఫ్యాషన్ ప్రో ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

Advertisement
Advertisement