మన పత్రిక, బెంగళూరు: సాంకేతిక పరిజ్ఞానం మనిషి అభివృద్ధికి ఎంతలా ఉపయోగపడుతుందో, అదే టెక్నాలజీ వినాశకరమైన నేరాలకు ఎలా దారితీస్తుందో బెంగళూరులో వెలుగుచూసిన దారుణ హత్యల ఉదంతం నిరూపిస్తోంది. సీగేహళ్లి అపార్ట్‌మెంట్‌లో సోమసుందర్ (52), ఆయన భార్య ముత్తులక్ష్మి (48), వారి చిన్న కుమార్తె సుప్రియ (19) హత్యకు గురయ్యారు. తొలుత సాధారణ మరణాలుగా భావించిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేయగా, సోమసుందర్ పెద్ద కుమార్తె శ్వేత తన ప్రియుడు కెన్నెత్‌తో కలిసి ఈ అరాచకానికి పాల్పడినట్లు తేలింది.
ఏఐ చాట్ బాట్ సలహాతో హత్యలు
ఈ హత్యల వెనుక విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా సొంత కుటుంబ సభ్యులను హతమార్చడం కోసం శ్వేత, కెన్నెత్‌లు గత ఆరు నెలలుగా అత్యంత పక్కాగా వ్యూహరచన చేసినట్లు తేలింది. ఎలాంటి ఆధారాలు దొరక్కుండా ఎవరినైనా ఎలా హత్య చేయాలి, మృతదేహాలను ఎలా మాయం చేయాలనే విషయాలపై వారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్‌ను ఆశ్రయించారు. ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసే శ్వేత, ఏఐ చాట్‌బాట్‌ను నిత్యం వాడుకుంటూ హత్యకు సంబంధించిన మెళకువలు, ప్లాన్‌లను అడిగి తెలుసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆరు నెలల పాటు చాట్‌బాట్ ఇచ్చిన సూచనల ప్రకారమే తాము ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు నిందితులు విచారణలో అంగీకరించారు.
ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన కేఆర్‌పురం పోలీసులు, నిందితులు ఉపయోగించిన ఏఐ చాట్‌బాట్ టూల్ కంపెనీకి అధికారికంగా లేఖ రాశారు. ఆరు నెలల కాలంలో నిందితులు ఏఐ టూల్‌ను ఏయే అంశాలపై సంప్రదించారు, ఏ విధమైన ప్రశ్నలు అడిగారు, చాట్‌బాట్ ఇచ్చిన రెస్పాన్స్‌లు ఏమిటనే పూర్తి డిజిటల్ డేటాను కోరారు. ఏఐ కంపెనీ అందించే ఈ వివరాలను ఈ కేసులో అత్యంత కీలకమైన డిజిటల్ సాక్ష్యంగా పరిగణించనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
