మన పత్రిక, తెలంగాణ: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన ‘గజ్వేల్ బంద్’ ఉదయం నుంచే ఉధృతంగా కొనసాగుతోంది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతుండటంతో నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. బంద్‌లో భాగంగా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బస్ డిపో ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజామున బస్సులు బయటకు రాకుండా అడ్డుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందని, ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు. నిందితులను వెంటనే గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గజ్వేల్ పట్టణంలోని ప్రధాన మార్కెట్లు, వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు బంద్ పిలుపుతో స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పట్టణవ్యాప్తంగా పెద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద పికెటింగ్‌లు ఏర్పాటు చేసి, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
