మన పత్రిక, శ్రీకాకుళం: రూ. 4 కోట్ల విలువైన భూకబ్జా కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఇచ్చి న ఆదేశాల మేరకు బుధవారం ఉదయం 10 గంటలకు ఆయన పోలీసుల ముందు విచారణకు రాగా, దర్యాప్తు అధికారులు ఆయనను విచారిస్తున్నారు.
బతికున్న భూ యజమాని చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించి, ఒడిశాకు చెందిన ఒక మహిళను ఏకైక వారసురాలిగా చూపిస్తూ కబ్జాకు కుట్ర పన్నినట్లు ఈ కేసులో ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో తమ్మినేని సీతారాం (A6), ఆయన భార్య వాణిశ్రీ (A7), ఆయన కుమారుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగ్ (A5) నిందితులుగా ఉన్నారు. కేసు నమోదైన సమయంలో ఆముదాలవలసలోని తమ నివాసం నుంచి పరారైన వీరి కోసం పోలీసులు అప్పట్లో ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.
హైకోర్టు ఆదేశాలు, బెయిల్ వివరాలు
నిందితులు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా, తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణిశ్రీలకు తాత్కాలిక మధ్యంతర ముందస్తు బెయిల్ లభించింది. విచారణకు పూర్తిగా సహకరించాలని, దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని స్పష్టం చేసిన న్యాయస్థానం, సహకరించకపోతే బెయిల్ రద్దు చేస్తామని పేర్కొంది. ప్రధాన బెయిల్ పిటిషన్పై విచారణను ఆగస్టు 17కి వాయిదా వేసింది. తమ్మినేని కుమారుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించడంతో ఆయన పరారీలో ఉన్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
