మన పత్రిక: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు రాష్ట్రంలోని మందుబాబుల జేబులపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో ఏర్పడిన మార్పులు మద్యం ధరల పెంపుకు దారితీస్తున్నాయి. ఈ వేసవిలో మద్యం, బీర్ల ధరలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాధారణంగా రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకొకసారి మద్యం ధరలను సమీక్షిస్తారు. చివరిసారిగా 2023 మేలో ధరలు పెంచగా, నిబంధనల ప్రకారం 2025 మేలో మళ్లీ సమీక్ష జరగాల్సి ఉంది. అయితే ఈ గడువు ఇప్పటికే ముగియడంతో ధరల పెంపు అనివార్యంగా మారింది.ఇక అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో సహజ వాయువు సరఫరా దెబ్బతినడం కూడా ప్రధాన కారణంగా మారింది. గాజు సీసాల తయారీలో ఉపయోగించే నేచురల్ గ్యాస్ కొరతతో దేశంలోని తయారీ యూనిట్లు ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వచ్చింది. కొన్ని యూనిట్లు పూర్తిగా మూతపడగా, ప్రధాన గాజు తయారీ కేంద్రాల్లో ఉత్పత్తి దాదాపు 40 శాతం పడిపోయినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఖాళీ సీసాల ధరలు సుమారు 20 శాతం వరకు పెరిగాయి.
ఈ అదనపు భారాన్ని భరించలేమని పేర్కొంటూ డిస్టిలరీ యాజమాన్యాలు ఇప్పటికే ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. ఇటీవల ఎక్సైజ్ శాఖ అధికారులతో సమావేశమైన తయారీదారులు మద్యం ధరలను 12 నుంచి 15 శాతం వరకు పెంచాలని వినతిపత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ధరల పెంపు దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో జ్యుడీషియల్ కమిటీని నియమించి అంశంపై లోతైన పరిశీలన చేపట్టింది. బాటిల్ పరిమాణం (90 మి.లీ, 180 మి.లీ, 375 మి.లీ, 750 మి.లీ), బ్రాండ్ స్థాయి (లో కాస్ట్, మిడ్ రేంజ్, ప్రీమియం), పన్ను నిర్మాణం ఆధారంగా ఐదు స్లాబులుగా ధరల పెంపు అమలు చేసే అవకాశముంది. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం మే నెలలో కొత్త ధరలను ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలోని మద్యం ప్రియులు మరింత ఖర్చు భారం మోసే పరిస్థితి ఏర్పడనుంది.
