Advertisement

ఆదిలాబాద్ జిల్లాకు సీఎం.. 900 మంది పోలీసులతో బందోబస్తు

మన పత్రిక, తెలంగాణ: ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సోమవారం పిప్రి గ్రామంలో జరగనున్న బహిరంగ సభకు అనుముల రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించిన వివరాల ప్రకారం, మొత్తం 900 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో సభ నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్క పోలీసు సిబ్బంది తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

భద్రతా ఏర్పాట్లను మొత్తం 9 సెక్టార్లుగా విభజించారు. ముఖ్య అతిథి హెలిప్యాడ్, కాన్వాయ్ రూట్, మీటింగ్ ప్రాంగణం, ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్లు, పార్కింగ్ ప్రదేశాలు, ట్రాఫిక్ నియంత్రణ, బాంబు స్క్వాడ్ వంటి విభాగాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సభకు వచ్చే ప్రజలు తమ వాహనాలను కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలిపివేయాలని సూచించారు.ట్రాఫిక్ పరంగా కూడా ప్రత్యేక ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చారు. సోమవారం నుంచి పిప్రి గ్రామం వరకు వన్‌వే ట్రాఫిక్ అమలు చేయనున్నారు. నిర్మల్ నుంచి వచ్చే వాహనాలు బోత్ ఎక్స్ రోడ్ మీదుగా బజార్‌హట్‌నూర్ చేరుకుని సభా స్థలానికి రావాలని సూచించారు. ఆటోలు, టూ వీలర్లు ఇచ్చోడ బస్టాండ్ మార్గంలో దిగ్నూర్, గంగాపూర్, లక్ష్మీనాయక్ తండా మీదుగా వెళ్లాలని తెలిపారు. ఈ బందోబస్తులో 3 మంది అదనపు ఎస్పీలు, 5 మంది డీఎస్పీలు, 21 మంది సీఐలు, 51 మంది ఎస్ఐలు, 350 మంది కానిస్టేబుళ్లు, 112 మంది మహిళా పోలీసు సిబ్బంది, 120 మంది ప్రత్యేక పార్టీ పోలీసులు, సాయుధ బలగాలు పాల్గొంటున్నట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు తీసుకున్నామని, ఎలాంటి అంతరాయాలు లేకుండా కార్యక్రమం విజయవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

Advertisement
Advertisement