మన పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రెండు రోజుల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొననున్నాయి. ఒకవైపు మండుతున్న ఎండలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుండగా, మరోవైపు అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకారం, మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండలు ఉండగా, సాయంత్రానికి వర్షాలు, ఉరుములు, పిడుగులతో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతం మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అలాగే రాయలసీమ పరిసరాల్లో ఉన్న మరో ఆవర్తనం ప్రభావంతో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా మేఘావృత వాతావరణం ఏర్పడి, పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇక ఎండల తీవ్రత కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వీరఘట్టం, నెల్లూరుపాలెం ప్రాంతాల్లో అత్యధికంగా 42.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రేణిగుంటలో 42.3 డిగ్రీలు, ఒంటిమిట్టలో 41.5 డిగ్రీలు, పెడపారుపూడిలో 41.3 డిగ్రీలు నమోదయ్యాయి. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సోమవారం చింతూరు, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ, తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఏలూరు, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అలాగే రాయలసీమలోని అన్నమయ్య జిల్లా, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశముంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
