మన పత్రిక, ఆంధ్రప్రదేశ్: నెల్లిమర్ల రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. లోకం నాగమాధవి ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారంటూ వచ్చిన ఫిర్యాదు తీవ్ర చర్చకు దారి తీసింది. ఆమెకు చెందిన ‘మిరాకల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్’ సంస్థ ద్వారా 2024 ఎన్నికల సమయంలో భారీగా నగదు మళ్లించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ సంస్థలో పని చేసిన మాజీ ఉద్యోగి ఆనంద్, పక్కా సాక్ష్యాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఫిర్యాదు ప్రకారం 2024 జనవరి నుంచి ఏప్రిల్ మధ్య సుమారు 300 మంది ఉద్యోగుల ఖాతాల్లోకి జీతంతో పాటు అదనంగా రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు జమ చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆ మొత్తాన్ని నగదు రూపంలో వెనక్కి తీసుకున్నట్లు ఆరోపించారు.
ఈ విధానాన్ని ‘శాలరీ రౌండ్ ట్రిప్పింగ్’గా అభివర్ణిస్తూ, ఇలా సేకరించిన కోట్లాది రూపాయలను ఎన్నికల ఖర్చుల కోసం అక్రమంగా వినియోగించారని ఆరోపించారు. అధికారికంగా చూపించే ఎన్నికల వ్యయానికి, వాస్తవంగా జరిగిన ఖర్చులకు భారీ తేడా ఉందని ఫిర్యాదులో వెల్లడించారు. ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలను ఉపయోగించి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని కూడా పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించింది. సమగ్ర విచారణ జరిపి పూర్తి నివేదికను సమర్పించాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ‘క్యాష్ బ్యాక్’ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే నాగమాధవి నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. విచారణ అనంతరం నిజానిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
