మన పత్రిక: నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికలను అకస్మాత్తుగా వాయిదా వేయడంపై బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. మున్సిపల్ కార్యాలయంలోనే బైఠాయించి ఆందోళనకు దిగారు.
బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిని చైర్మన్‌గా ఎన్నుకోవడానికి సరిపడా కోరం ఉన్నప్పటికీ అధికారులు ఎన్నికను వాయిదా వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో ఇరుపార్టీల కౌన్సిలర్లు, నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన చేపట్టారు. వారికి మద్దతుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్, బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ జాన్సన్ నాయక్ కూడా ఆందోళనలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి ఎన్నిక నిర్వహించాలని, లేదంటే చనిపోయే వరకు ఇక్కడే కూర్చుంటామని నిరసనకారులు హెచ్చరించారు. అలాగే ఎన్నికలను హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. కౌన్సిల్ సభ్యులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎన్నికను ఎలా వాయిదా వేస్తారని ప్రశ్నించారు. ఈ ఆందోళన మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఖానాపూర్ 8వ వార్డు బీజేపీ కౌన్సిలర్ బొప్పారావు సత్యవతి అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలారు. వెంటనే ఆమెను తోటి కౌన్సిలర్లు అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల్లో ఎన్నికలు సజావుగా పూర్తయ్యాయి. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్-సీపీఐ కూటమి విజయం సాధించింది. చైర్‌పర్సన్‌గా డాక్టర్ గుడిసెల సంధ్యారాణి, వైస్ చైర్‌పర్సన్‌గా సీపీఐ అభ్యర్థి సరిత ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ సంఖ్యాబలం లేకపోవడంతో ఎన్నికకు దూరంగా ఉంది. అలాగే ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్, బీజేపీ కైవసం చేసుకున్నాయి. చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్‌పర్సన్‌గా శ్యామల ఎన్నికయ్యారు. మొత్తం మీద ఖానాపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా, ఇతర ప్రాంతాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
