మన పత్రిక, తెలంగాణ: రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వచ్చే విద్యా సంవత్సరంనుంచి విద్యార్థులకు అందించే సౌకర్యాలను మరింత విస్తరించనుంది. ఇప్పటికే యూనిఫామ్‌లు, పాఠ్యపుస్తకాలు అందిస్తున్న ప్రభుత్వం, ఇకపై బ్లాక్ షూస్, బెల్టులు, సాక్స్‌లను కూడా అందించనుంది.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 18.70 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ, లోకల్ బాడీ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికీ రెండు జతల సాక్స్, బ్లాక్ షూస్, బెల్టులు అందించేందుకు విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. అబ్బాయిలు, అమ్మాయిలకు వేర్వేరు టైలను కూడా అందించనున్నారు. ఇవన్నీ జూన్ 12న ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరపు మొదటి రోజే అందించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
గురుకులాలకు సమానంగా సౌకర్యాలు
ఇప్పటివరకు కేజీబీవీ, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్ హాస్టళ్లలో చదివే విద్యార్థులకు సౌకర్యాల్లో కొంత వ్యత్యాసం ఉండేది. ఇకపై ఈ విద్యార్థులకు కూడా గురుకుల పాఠశాలల స్థాయిలోనే అన్ని వసతులు కల్పించనున్నారు. దీంట్లో భాగంగా కేజీబీవీ, మోడల్ స్కూల్ హాస్టళ్ల విద్యార్థులకు ఏకంగా 18 రకాల వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్‌ను అందించనున్నారు. వచ్చే ఏడాది నుంచి కిట్‌లో పలు కొత్త మార్పులు చేశారు. స్కూల్ బ్యాగులు, ట్రంక్ బాక్స్‌లు, స్టేషనరీ కిట్లు కొత్తగా జోడించారు. హాస్టల్ విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫాం, పీటీ డ్రెస్సులు, నైట్ డ్రెస్సులు కూడా అదనంగా ఇవ్వనున్నారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా సమగ్రంగా ఈ కిట్‌ను రూపొందించారు.
యూనిఫామ్‌ల తయారీకి అవసరమైన వస్త్రాన్ని టెస్కో ద్వారా అందించేందుకు ఇప్పటికే ఒప్పందం కుదిరింది. ఏప్రిల్ చివరికల్లా మండల, పాఠశాల కేంద్రాలకు సరఫరా పూర్తయ్యేలా షెడ్యూల్ రూపొందించారు. ఇకపై అన్ని వస్తువులను ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ) ద్వారా సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెస్కో ద్వారా వస్త్ర సరఫరాపై ఉన్న సందేహాలు కూడా త్వరలో నివృత్తి అవుతాయని అధికారులు భావిస్తున్నారు.
స్కూల్ బ్యాగులు, బెల్ట్, టై, ఐడీ కార్డు, బెడ్ షీట్లు, టవల్స్, కార్పెట్లు, ట్రంక్ బాక్స్‌లు, ప్లేట్, గ్లాస్, కటోరా, కప్పు-స్పూన్, ట్రాక్ సూట్లు, నైట్ డ్రెస్సులు, పీటీ డ్రెస్సులు, బ్లాక్ షూస్, వైట్ షూస్, సాక్స్‌లు, దుప్పట్లు, స్టేషనరీ కిట్లు, నోట్‌బుక్స్ తదితర వస్తువులను అందించనున్నారు.ఈ నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మరింత సౌకర్యవంతమైన విద్యా వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేసింది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
