Advertisement

నిర్మల్: కాంగ్రెస్ సర్పంచ్ సూసైడ్.. కారణం ఇదే..?

మన పత్రిక, TG క్రైం: పల్లె ప్రజల మద్దతుతో సర్పంచిగా ఎన్నికైన మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. కుటుంబ తగాదాల కారణంగా మనోవేదనకు గురై పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన శుక్రవారం నిర్మల్ జిల్లా కండెం మండలం మాసాయిపేటలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం మాసాయిపేట సర్పంచి దుర్గం లహరిక (31) ఇంటి వద్ద పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కారులో ఖానాపూర్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మార్గమధ్యలో కారు ట్రాక్టర్‌ను ఢీకొనడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం మరో వాహనంలో ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లహరిక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల లహరికకు భర్త దుర్గం రాజేశ్‌తో తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. భర్త వేధింపులు, దాడుల వల్లనే తీవ్ర మానసిక ఆందోళనకు గురై ఈ దారుణ నిర్ణయం తీసుకుందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై సాయికిరణ్ తెలిపారు. ఈ ఘటనపై స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధికి కృషి చేసిన లహరిక మృతి పట్ల సంతాపం తెలిపారు. కుటుంబ కలహాలు ఇంతటి విషాదానికి దారితీయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. లహరికకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారి భవిష్యత్తుపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో మాసాయిపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement