మన పత్రిక: తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఊరటనిచ్చే దిశగా రెండో విడత రైతుభరోసా నిధుల విడుదలకు సిద్ధమవుతోంది. ఇందుకోసం సుమారు రూ.2,650 కోట్లను సమీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను ఆదేశించినట్లు సమాచారం. జీతాలు, అప్పుల కిస్తీలు చెల్లించిన తర్వాత మిగిలిన వనరులతో నిధుల సమీకరణపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.మొత్తం మూడు విడతల్లో యాసంగి రైతుభరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మొదటి విడతలో భాగంగా మార్చి 22న రూ.3,590 కోట్లను సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు. రెండో విడత నిధులను ఈ నెల రెండో వారంలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దఫాలో ఎకరం కంటే ఎక్కువ భూమి కలిగిన రైతులకు నిధులు జమ చేయనున్నారు. ముఖ్యంగా 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. మిగతా రైతులకు ఈ నెల చివర్లో నిధులు విడుదల చేసే అవకాశముంది. ప్రతి సీజన్‌కు ఎకరాకు రూ.6,000 చొప్పున సాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ పథకం అమలు కోసం సుమారు రూ.9,000 కోట్ల అవసరం ఉండటంతో, ఆర్థిక వనరుల కొరత కారణంగా విడతలవారీగా చెల్లింపులు చేపడుతోంది. రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ చర్యలు కొనసాగుతున్నాయి.
TG: రైతులకు గుడ్‌న్యూస్.. రెండో విడత ‘రైతుభరోసా’కు రంగం సిద్ధం!

Advertisement