మన పత్రిక, TG: నిత్యావసర ధరల పెరుగుదల సామాన్యుడి జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఒకవైపు ఎల్‌పీజీ సిలిండర్ల కొరత, బ్లాక్ మార్కెట్ దందా.. మరోవైపు వంట నూనెల ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో సరఫరా వ్యవస్థ దెబ్బతిని, వంటగది ఖర్చులు భారీగా పెరిగాయి.
రాష్ట్రంలో గ్యాస్ సరఫరాలో అంతరాయాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డొమెస్టిక్ సిలిండర్ అధికారిక ధర రూ.965 ఉండగా, బ్లాక్ మార్కెట్‌లో రూ.1,500 నుంచి రూ.2,000 వరకు విక్రయిస్తున్నారు. కమర్షియల్ సిలిండర్ల ధరలు మరింతగా పెరిగి రూ.4,000 నుంచి రూ.6,500 వరకు వసూలు చేస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. బుకింగ్ చేసినా రోజులు గడుస్తున్నా సిలిండర్లు అందకపోవడం, డెలివరీ అయిందని తప్పుడు మెసేజ్‌లు రావడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది.
వంట నూనెల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర లీటర్‌కు రూ.170 నుంచి రూ.180 వరకు పెరిగింది. పామాయిల్ ధరలు కూడా రూ.140 నుంచి రూ.145కి చేరాయి. అంతర్జాతీయ సరఫరాలో అంతరాయం, దిగుమతుల తగ్గుదల వల్ల ఈ పెరుగుదల చోటుచేసుకుంది. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ ప్రాంతాల నుంచి సరఫరా తగ్గడం ప్రభావం చూపుతోంది.
ఈ ధరల పెరుగుదలతో చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు ఖర్చులను తగ్గించేందుకు నాణ్యతను తగ్గించడం లేదా ధరలను పెంచడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి. దీంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది.ఓటీపీ ఆధారిత డెలివరీలో అవకతవకలు జరుగుతున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గ్యాస్ రాకముందే డెలివరీ అయినట్లు మెసేజ్‌లు రావడం వంటి ఘటనలు బయటపడుతున్నాయి. ఈ పరిస్థితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. వంట గది నిర్వహణ రోజు రోజుకీ భారంగా మారుతున్న నేపథ్యంలో తక్షణ చర్యలు అవసరం.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
