Advertisement

HNK: స్విమ్మింగ్ పూల్‌లో పడి తల్లి, ఇద్దరు కుమార్తెల మృతి!

మన పత్రిక, క్రైం: హనుమకొండ జిల్లాలో విషాదం నెలకొంది. ఐనవోలు మండలం ఫున్నేలులో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్ అజహరుద్దీన్ తన భార్య ఫర్హత్‌(26), కూతుళ్లు ఉమేరా(8), ఆయేషా(7)తో కలిసి బుధవారం రాత్రి స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లాడు. కొంతసేపు బయటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ముగ్గురు నీటిలో మృతిచెందిన స్థితిలో కనిపించారు. పిల్లలకు ఈత రాక మునిగిపోతుండగా వారిని రక్షించే ప్రయత్నంలో తల్లి కూడా మునిగిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదిలా ఉండగా మృతురాలి తల్లి సంచలన ఆరోపణలు చేసింది. తన కుమార్తె మూడు నెలల గర్భిణి అని, గతంలో రెండు సార్లు గర్భస్రావాలు చేయించారని ఆరోపించింది. ఆడపిల్లలు పుడుతున్నాయనే కారణంతో భర్త వేధింపులకు గురిచేశాడని, అత్తింటివారే తన కూతురిని హత్య చేశారని పేర్కొంది. ఇక ఈ ఘటన మరింత విషాదాన్ని మిగిల్చింది. పెద్ద కుమార్తె ఉమేరా పుట్టినరోజు సందర్భంగా కుటుంబం ఆనందంగా వేడుకలు జరుపుకుంది. కేక్ కట్ చేసి, భోజనం చేసిన అనంతరం స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది. ఆనందంగా సాగిన ఆ వేడుక క్షణాల్లోనే విషాదంగా మారింది. తండ్రి బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement