మన పత్రిక వెబ్‌డెస్క్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌లో రాష్ట్రానికి దక్కిన కేటాయింపులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆయన నిర్ణయించారు. ఇందులో భాగంగా గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం నుంచి గరిష్ఠంగా నిధులు రాబట్టడమే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు.
ముఖ్యంగా గత ప్రభుత్వం చేసిన తప్పులను పునరావృతం చేయవద్దని చంద్రబాబు అధికారులను హెచ్చరించారు. గతంలో కేంద్ర నిధులను సరిగ్గా ఖర్చు చేయకపోవడం, సరైన సమయానికి వినియోగ పత్రాలు (Utilization Certificates) సమర్పించకపోవడం వల్ల రాష్ట్రం చాలా నష్టపోయిందని గుర్తుచేశారు. ఈసారి ఆ పరిస్థితి రాకూడదని, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన నిధులను వంద శాతం ఖర్చు చేసి, అదనపు నిధులు పొందేలా చూడాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు భారీ ప్రాజెక్టులను తీసుకురావాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉత్తరాంధ్ర వాసులకు శుభవార్త చెబుతూ.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ‘రేర్ ఎర్త్ కారిడార్’ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే పల్నాడు ప్రాంతంలో మెగా టెక్స్‌టైల్ పార్కు, తిరుపతిలో స్పోర్ట్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్, హిందూపురంలో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీ యూనిట్‌ను ప్రతిపాదించాలని ఆదేశించారు.
రాజధాని అమరావతిని టెక్నాలజీ మరియు హెల్త్ హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలు రచించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కింద అమరావతిలో సెమీకండక్టర్ డిజైన్ ప్రాజెక్టులను చేపట్టాలని, హెల్త్ సిటీలో మెడికల్ టూరిజంను ప్రోత్సహించేలా ‘హీల్ ఇన్ ఏపీ’ విధానాన్ని తీసుకురావాలని తెలిపారు. ఇక రవాణా రంగానికి సంబంధించి కేంద్రం మంజూరు చేసిన 1000 ఎలక్ట్రిక్ బస్సులను వెంటనే రోడ్లపైకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
