Advertisement

చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకే నీళ్ల తరలింపు: మాజీ మంత్రి హరీశ్‌రావు

TG: దేశమంతా ఎల్‌నినో ప్రభావం ఉన్న ఈ తరుణంలో చుక్కచుక్క నీటిని ఒడిసిపట్టాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో కృష్ణా జలాలపై మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో పంట పొలాలు ఎండుతుంటే, కృష్ణా జలాలను దుర్మార్గంగా, నిర్లక్ష్యంగా ఏపీకి వదులుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్లముందే నీళ్లు పారుతున్నా ప్రజలకు ఇవ్వలేని దుస్థితి సాగుతోందని ధ్వజమెత్తారు.

పాలమూరుపై సీఎం రేవంత్‌రెడ్డికి ఉన్న ప్రేమ ఏంటో దీనిబట్టి అర్థమైందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. నికర జలాలు లేని వెలగొండకు ఏపీ నీళ్లు ఎత్తుకెళ్తుంటే, నికర జలాల కేటాయింపు ఉన్న బీమా మోటార్లు మాత్రం ఎందుకు నడపడం లేదని సీఎంను సూటిగా ప్రశ్నించారు. కల్వకుర్తిలో మూడు మోటార్లు ఎందుకు బంద్‌ పెట్టారంటూ నిలదీశారు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. అసెంబ్లీలో మార్షల్స్‌ను పెట్టి తమను బయటికి గెంటడం కాదని, నదిలో నీళ్లు పోకుండా అడ్డుకోవాలని రేవంత్‌రెడ్డిపై ఫైర్ అయ్యారు. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం తాకట్టు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement