Advertisement

పెళ్లయినంత మాత్రాన మహిళల స్వేచ్ఛ అంతం కాదు: సుప్రీంకోర్టు

హైదరాబాద్‌: వైవాహిక అత్యాచారాన్ని (Marital Rape) నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పెళ్లి అయినంత మాత్రాన మహిళల వ్యక్తిగత స్వయంప్రతిపత్తి, స్వేచ్ఛ అంతం కాకూడదని అత్యున్నత త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. భార్య అంగీకారం లేకుండా భర్త లైంగిక సంబంధం కలిగి ఉండే చర్యను మినహాయింపుగా మారుస్తున్న చట్ట నిబంధనలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ విచారణ కొనసాగుతోంది.

భారత ప్రధాన జస్టిస్‌ (CJI) సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జాయ్‌మల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. ఈ వివాదానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అఫిడవిట్‌ దాఖలు చేసిందని, అన్ని పక్షాల వాదనల సారాంశాన్ని క్రోడీకరించాలని కోర్టు ఆదేశించింది. ఈ వ్యాజ్యాలపై ఇకపై ప్రతి బుధవారం, గురువారాల్లో తుది విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.

Advertisement

ఐపీసీ సెక్షన్ 375, కొత్త బీఎన్‌ఎస్‌ సెక్షన్ 63 ప్రకారం.. 18 ఏళ్లు నిండిన భార్యతో లైంగిక చర్యలకు ఉన్న మినహాయింపును తొలగిస్తే వివాహ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని కేంద్ర ప్రభుత్వం గతంలో వాదించింది. ఢిల్లీ హైకోర్టు భిన్నాభిప్రాయాల తీర్పుపై ఖుష్బూ సైఫీ, ఆర్‌ఐటీ ఫౌండేషన్, ఎయిడ్వా తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ప్రస్తుతం ఈ సున్నితమైన అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisement