Advertisement

8 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ: దేశంలో రైలు ప్రయాణాలను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. పలు రైల్వే కారిడార్లలో నాలుగు లైన్ల నిర్మాణం కోసం 8 మల్టీ ట్రాకింగ్‌ ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరించారు. మొత్తం ప్రాజెక్టుల్లో దక్షిణాది రాష్ట్రాలకు పెద్దపీట వేస్తూ 5 ప్రాజెక్టులకు, ఉత్తరాదిలో 3 ప్రాజెక్టులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలో ఐదు కీలక మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు సాకారమవనున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా నాలుగు రాష్ట్రాల్లోని 17 జిల్లాల పరిధిలో రైల్వే నెట్‌వర్క్ బలపడనుంది. సుమారు రూ.10,021 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టులను 2029-30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుల పుణ్యమా అని దక్షిణాదిలో దాదాపు 2,121 గ్రామాలకు కొత్తగా రైలు మార్గం అందుబాటులోకి రానుంది.

ప్రధాన ప్రాజెక్టుల వివరాలు:

Advertisement
  • ఘట్‌కేసర్‌ – కాజీపేట మధ్య రూ.2,419 కోట్లతో 110 కి.మీ. మేర నాలుగో లైన్ నిర్మాణం.
  • అరక్కోణం – రేణిగుంట సెక్షన్‌లో 77 కి.మీ. పొడవుతో 3, 4వ లైన్ల నిర్మాణం.
  • వైట్‌ఫీల్డ్‌ – బంగారుపేట మధ్య 47 కి.మీ. మేర 3, 4వ లైన్ల నిర్మాణం.
  • 159 కి.మీ. మేర సేలం – కరూర్‌ – దుండిగల్‌ డబ్లింగ్ పనులు.
  • 147 కి.మీ. మేర హోసూర్‌ – ఒమలూరు డబ్లింగ్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
Advertisement