Advertisement

స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై విచారణకు సీఎం ఆదేశం

హైదరాబాద్‌: శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను దూషించడం, ఎర్రవల్లిలో దళితులు నడిచారనే నెపంతో రోడ్డును శుద్ధి చేసిన ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సెప్టెంబర్‌ 6 నుంచి జరిగిన ఈ వరుస పరిణామాలపై సమగ్ర విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ఆదేశాలు జారీ చేశారు. రాజకీయంగా ఎన్ని విభేదాలైనా ఉండొచ్చని, కానీ దళిత స్పీకర్‌ను ఘోరమైన పదాలతో దూషించి తల్లిని అవమానించేలా ప్రవర్తించారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల వివక్షను, అణచివేతను తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని స్పష్టం చేశారు. అంటరానితనం ప్రదర్శించిన వారిపై, కుట్రలు పన్నిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనల విచారణ నిమిత్తం హైదరాబాద్‌ జాయింట్‌ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ను విచారణాధికారిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కసబ్‌ వంటి ఉగ్రవాదులకు, స్పీకర్‌ను తిట్టిన వారికి తేడా లేదన్నారు. దళితులు నడిచారని నేలను శుద్ధి చేయడం దొర అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. శుద్ధి చేయాల్సింది నేలను కాదని, తరతరాలుగా వారి మనసుల్లో ఉన్న కుళ్లు, అంతరాలనని విమర్శించారు. కేసీఆర్‌ ఆదేశాల మేరకే ఈ కుట్రలు జరిగాయని ఆరోపించారు. సూచనలు చేసిన వారిపై, అమలు చేసిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి కోర్టు ముందు దోషులుగా నిలబెడతామని నేతలు స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా ఇలాంటి ఘటనలపై కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ప్రభుత్వం తేల్చిచెప్పింది.

Advertisement
Advertisement