Advertisement

కేడర్‌కు సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం

అమరావతి: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కుప్పం పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆదివారం ఉండవల్లి నివాసంలో కుప్పం నియోజకవర్గానికి చెందిన నాలుగు మండలాల ముఖ్య నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు.

పంచాయతీ, మండల, జడ్పీ, మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని సూచించారు. “పదవులు పొంది కష్టపడకపోతే కుదరదు. ఫలితాల్లో తేడా వస్తే ఉపేక్షించేది లేదు. లాలూచీ రాజకీయాలకు స్వస్తి పలకాలి” అని హెచ్చరించినట్లు నేతలు తెలిపారు. కుప్పం స్థానిక ఎన్నికల బాధ్యతలను ఎమ్మెల్సీ శ్రీకాంత్‌కు అప్పగించే అంశంపై అభిప్రాయాలు సేకరించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. త్వరలోనే కుప్పంలో రెండు రోజులు పర్యటిస్తానని చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, జీఎం రాజు, ప్రతాప్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement