Advertisement

మళ్లీ సీఎంగానే సభలోకి కేసీఆర్: బీఆర్‌ఎస్ ఎల్పీ

హైదరాబాద్: ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో అనుచిత భాష వాడుతున్నందున, అలాంటి గౌరవం లేని సభకు BRS అధినేత కేసీఆర్ వెళ్లాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఎర్రవెల్లిలో కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం జరిగిన బీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్, జయలలిత, చంద్రబాబు లాంటి నేతలు సభలో అవమానాలు ఎదుర్కొన్నప్పుడు ప్రజాక్షేత్రంలో గెలిచి మళ్లీ సీఎంగానే అడుగుపెట్టారని, కేసీఆర్ కూడా అదే బాటలో మళ్లీ సీఎంగానే అసెంబ్లీలోకి వస్తారని పేర్కొన్నారు.

శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించిన అనంతరం పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చించడానికి కనీసం నెల రోజుల పాటు సభ నడపాలని బీఏసీలో డిమాండ్ చేస్తామన్నారు. 22ఏ భూముల సమస్యలు, కరెంట్ కోతలు, రుణమాఫీ వైఫల్యం, పాలిటెక్నిక్ జీవో 97 రద్దు, సింగరేణి కుంభకోణాలు, పీఆర్సీ, డీఏలు, ఈహెచ్‌ఎస్ వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. రాష్ట్రంలో 30 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంపై సభను స్తంభింపజేసైనా కొట్లాడతామన్నారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులపై కాంగ్రెస్ నిర్లక్ష్యానికి నిరసనగా కేసీఆర్ లక్షల మందితో ప్రత్యక్ష ఉద్యమానికి నాయకత్వం వహిస్తారని వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ మాని, వార్డు మెంబర్ కూడా కాని తన సోదరుడి భద్రత కోసం రూ. 40 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement