మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణలో ఓటర్ల జాబితా పునఃసవరణ ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 73,39,235 ఓట్లను తొలగించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సీ సుదర్శన్ రెడ్డి వివరాలను వెల్లడించారు. ఈ తొలగింపుల్లో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలోనే 19,41,444 ఓట్లు ఉన్నట్లు అధికారిక డేటా స్పష్టం చేస్తోంది.
గతంలో 2026 జూన్ 10 నాటికి తెలంగాణలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా నాటికి ఈ సంఖ్య 2,64,87,213కి తగ్గింది. దీంతో మొత్తం ఓటర్ల సంఖ్యలో 21.70 శాతం మేర తగ్గుదల నమోదైంది. ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన కారణంతో అత్యధికంగా 45,18,963 ఓట్లను తొలగించారు. అలాగే చిరునామా లేకపోవడం లేదా ఆచూకీ లభించని వారి సంఖ్య 11,25,546 కాగా, మరణించిన వారి ఓట్లు 9,22,229 ఉన్నాయి. ఇతర నియోజకవర్గాల్లో నమోదు కావడంతో 6,70,203 ఓట్లను, ఇతర విభిన్న కారణాలతో మరో 1,02,294 ఓట్లను జాబితా నుంచి తొలగించారు.
జిల్లాల వారీగా వివరాలు
జిల్లాల పరంగా పరిశీలిస్తే హైదరాబాద్ 19.41 లక్షల తొలగింపులతో అగ్రస్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో రంగారెడ్డి 12,87,091, మేడ్చల్-మల్కాజ్గిరి 10,71,566 ఓట్ల తొలగింపులతో ఉన్నాయి. యాదాద్రి-భువనగిరి జిల్లాలో అత్యల్పంగా 26,121 ఓట్లను తొలగించినట్లు నివేదిక పేర్కొంది.
హైదరాబాద్‌లోని నియోజకవర్గాల వారీగా జూబ్లీహిల్స్‌లో గరిష్టంగా 1,79,510 ఓట్లను తొలగించారు. యాకుత్‌పురాలో 1,54,982, చాంద్రాయణగుట్టలో 1,48,869, మలక్‌పేటలో 1,47,799 ఓట్లు జాబితా నుంచి వేరుపడ్డాయి. హైదరాబాద్ పరిధిలో చార్మినార్ నియోజకవర్గంలో అత్యల్పంగా 94,174 ఓట్లను తొలగించారు. అదే సమయంలో శాతం పరంగా చూస్తే ముషీరాబాద్ నియోజకవర్గంలో అత్యధికంగా 45.17 శాతం, మలక్‌పేటలో 44.76 శాతం ఓట్లు తగ్గాయి. బహదూర్ పురా నియోజకవర్గంలో అత్యల్పంగా 34.57 శాతం తొలగింపులు నమోదయ్యాయి.
ప్రస్తుతం ప్రకటించిన ఈ గణాంకాలు ఆఖరివి కావని, డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హులైన పౌరులు క్లెయిమ్‌లు, అభ్యంతరాల వ్యవధిలో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. పేరును తిరిగి చేర్చుకోవడానికి అర్హులు ఫారం 6 సమర్పించాల్సి ఉంటుంది. జిల్లాల వారీగా తొలగించిన ఓటర్ల సమగ్ర సమాచారాన్ని తెలంగాణ సీఈవో అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
