Advertisement

మీర్‌పేట్ రౌడీ షీటర్ హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు

మన పత్రిక, మీర్‌పేట్: మీర్‌పేట్‌లో సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ హత్య కేసును పోలీసులు 24 గంటల వ్యవధిలోనే ఛేదించారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నాగారం గ్రామానికి చెందిన దాసరి సురేందర్ అలియాస్ సూరి (41) హత్యకు గురయ్యాడని మీర్‌పేట్ ఇన్‌స్పెక్టర్ శోభన్ తెలిపారు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన వెల్లడించారు.

నందనవనం ప్రాంతానికి చెందిన మహమ్మద్ అర్ఫాస్ (22), సుహిద్రమణి స్వామి (19), జంగిలొల్ల నాని (19)లను నిందితులుగా గుర్తించారు. మృతుడు సూరి, ప్రధాన నిందితుడు అర్ఫాస్ మధ్య గతంలో నుంచి గొడవలు ఉన్నాయి. సూరి గతంలో అర్ఫాస్ సోదరి ఫాతిమాను వివాహం చేసుకున్నాడని, కుటుంబ సంబంధిత విభేదాల వల్లే ఈ హత్య జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. సోమవారం రాత్రి 11:44 గంటల సమయంలో నందనవనం ప్రాంతంలో సూరిపై కత్తులతో దాడి జరగగా, పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నేరాన్ని అంగీకరించడంతో వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Advertisement
Advertisement