Advertisement

కాక్రోచ్ జనతా పార్టీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై ఆరోపణలు

మన పత్రిక: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కొద్దిసేపు నిలిచిపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే కావాలని తమ ఖాతాను నిలిపివేసిందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తీవ్రంగా ఆరోపించారు. అయితే, ఈ ఖాతా నిలిచిపోయిన కొద్ది నిమిషాల్లోనే మళ్లీ పునరుద్ధరించబడింది.

ఎక్స్ వేదికగా ఆరోపణలు

తమ పార్టీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కేంద్ర ప్రభుత్వం తొలగించిందని అభిజీత్ దిప్కే ఎక్స్ వేదికగా ఆరోపణలు చేశారు. అయితే, ఆ తర్వాత కొద్దిసేపటికే ఖాతా మళ్లీ అందుబాటులోకి వచ్చిందని ఆయన ధృవీకరించారు. నీట్ పేపర్ లీకేజీ మరియు విద్యావ్యవస్థలోని లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, సీజేపీ జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపడుతోంది.

Advertisement

పార్లమెంట్ వరకు చేరిన వివాదం

సీజేపీ పిలుపునిచ్చిన చలో సంసద్ మార్చ్‌లో భాగంగా ఢిల్లీ పోలీసులు మరియు ఆందోళనకారుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతపై పోలీసులు బలప్రయోగం చేశారని కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీశాయి. ఈ రాజకీయ దుమారం కొనసాగుతున్న సమయంలోనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నిలిపివేత ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

Advertisement