Advertisement

వినాయక నిమజ్జనాలపై దుష్ప్రచారం నమ్మవద్దు: హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జన ఏర్పాట్లపై వస్తున్న వ్యతిరేక ప్రచారాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తీవ్రంగా ఖండించారు. చెరువుల్లో గణేష్ నిమజ్జనానికి తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. హైడ్రా ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న చెరువుల్లో నిమజ్జనాలకు అనుమతి లేదంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు.

కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన నాలుగైదు చెరువుల వద్ద మాత్రమే ఆంక్షలు ఉన్నాయని రంగనాథ్ స్పష్టం చేశారు. అమీన్‌పూర్ చెరువు దేశంలోనే ప్రప్రథమ బయో డైవర్సిటీ చెరువుగా, కాప్రా చెరువు నేచురల్ వెట్‌ల్యాండ్‌గా కేంద్రం గుర్తించిందని తెలిపారు. ప్రస్తుతం కాప్రా చెరువులో నీళ్లు లేనందున అక్కడ సమస్యలు సృష్టించవద్దని కోరారు. మిగతా అన్ని చెరువుల్లోనూ నిమజ్జనాలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు. ప్రధాన నీటి వనరులు దెబ్బతినకుండా, ఉత్సవ కమిటీలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా ‘బేబీ పాండ్స్’ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఉత్సవాలను ప్రశాంతంగా, పర్యావరణ హితంగా నిర్వహించుకునేలా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement