Advertisement

కామారెడ్డిలో అధ్వానంగా రోడ్లు: సామాన్యుల పట్ల నిర్లక్ష్యం

మన పత్రిక, కామారెడ్డి: జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారుల పరిస్థితి దయనీయంగా మారింది. ఏళ్లుగా రోడ్ల విస్తరణ, మరమ్మతులు కాగితాలకే పరిమితం కావడంతో సామాన్య ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పాత బస్టాండ్ నుంచి అడ్లూరు కలెక్టరేట్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో పంచముఖి హనుమాన్ మందిరం వద్ద ఉన్న బ్రిడ్జి ప్రాంతం గుంతలతో నిండిపోయింది. రోడ్డు విస్తరణ కోసం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఇంటిని కూడా కూల్చివేసినా, పనులు మాత్రం ఎక్కడివక్కడే ఆగిపోయాయి. చిన్నపాటి వర్షం పడితే చాలు, ఈ రోడ్డంతా బురదమయమవుతోంది. మరోవైపు కొత్త బస్టాండ్ నుంచి అశోక్ నగర్ మీదుగా రైల్వే గేటు వరకు ఉన్న రోడ్డు కూడా శిథిలావస్థకు చేరుకుంది. చిన్న వర్షానికే మోకాళ్ల లోతు నీరు నిలుస్తుండటంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. అదే రోడ్డుపై ఉన్న రైల్వే గేటు పడితే వాహనాలు కనీసం అరగంట పాటు నిలిచిపోతున్నాయి.

Advertisement

ప్రజాప్రతినిధులు, అధికారులు కలెక్టరేట్‌కు వెళ్లేందుకు ప్రధానంగా జాతీయ రహదారి 44ను ఆశ్రయిస్తున్నారు. కానీ సామాన్య ప్రజలు మాత్రం సమయం, డబ్బు వృథా అవుతాయనే భయంతో ఇరుకు, గుంతల రోడ్లనే వాడుకోవాల్సి వస్తోంది. ఏళ్ల తరబడిగా ఒకే రైల్వే బ్రిడ్జిపై ఆధారపడటం, రోడ్ల విస్తరణ పనులు నిలిచిపోవడంతో ప్రజలు నష్టపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్లను విస్తరించి, గుంతలను పూడ్చి సాఫీగా ప్రయాణం కల్పించాలని కోరుతున్నారు.

Advertisement