Advertisement

అమ్రాబాద్‌లో డిప్యూటేషన్‌పై వెళ్లిన ఉపాధ్యాయులను వెనక్కి పిలవాలని ఎమ్మెల్యే ఆదేశం

మన పత్రిక, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని పాఠశాలల్లో డిప్యూటేషన్‌పై వెళ్లిన ఉపాధ్యాయులను వెంటనే తిరిగి రప్పించాలని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. బ్రహ్మగిరి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేయగా, అక్కడ ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థుల చదువుకు ఇబ్బందులు కలుగుతున్నట్లు గుర్తించారు. 30 మందికి పైగా విద్యార్థులు ఉన్న ఆ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు దీర్ఘకాలిక సెలవులో ఉండగా, మరొకరు ఆలస్యంగా వచ్చి త్వరగా వెళ్లిపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితిపై మండల విద్యాశాఖ అధికారి బాలకిషన్‌ను ప్రశ్నించగా, సదరు ఉపాధ్యాయురాలు జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతితో డిప్యూటేషన్‌పై వెళ్లారని సమాధానమిచ్చారు. జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్‌కు ఫోన్ ద్వారా వివరణ కోరేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో అసంతృప్తి చెందిన ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి, డిప్యూటేషన్ విధానాన్ని రద్దు చేయాలని స్పష్టం చేశారు. మారుమూల ప్రాంతాల్లో పనిచేసే ప్రతి ఉపాధ్యాయుడు తమకు కేటాయించిన పాఠశాలల్లోనే విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Advertisement
Advertisement