మన పత్రిక: తెలంగాణలో మహిళల భద్రత పూర్తిగా గాలికి కొట్టుకుపోయిందని, ఆడబిడ్డలను కాపాడుకునే నాథుడే కరువయ్యాడని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో జరిగిన పోక్సో ఉదంతంపై ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో పోలీసులు, ప్రభుత్వం, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యవహరించిన తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
మే 16వ తేదీనే బాధిత బాలిక తల్లి ఫిర్యాదు చేసినప్పటికీ, నిందితుడు రాజ్ కుమార్ ముందస్తు బెయిల్ పొందేంత వరకు పోలీసులు అరెస్టు చేయకుండా కాలయాపన చేశారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఎల్‌బీ నగర్ పోక్సో కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను పరిశీలిస్తే, అందులో లేని వ్యక్తి (మృతురాలి సోదరుడు) బెయిల్‌ను వ్యతిరేకించినట్లు పేర్కొనడం ఆశ్చర్యకరమని ఆయన అన్నారు. వాస్తవానికి ఆ బాలికకు అన్న లేడని, కేవలం అక్క మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్రపై ఆరోపణలు
పోక్సో రూల్స్ 2020 ప్రకారం నిందితుడు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నప్పుడు బాధితులకు నోటీసులు అందించాల్సి ఉంటుందని ఆయన గుర్తుచేశారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తి కాంగ్రెస్ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు బిక్షపతి గౌడ్ అని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే పీపీగా ఉండటం వల్ల నిందితుడికి బెయిల్ లభించిందని, ఇలాంటి వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తే మహిళలకు న్యాయం ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు.
బాధిత కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్తున్న తమను పోలీసులు అరెస్టు చేస్తున్నారని, అదే ఉత్సాహాన్ని నిందితులను పట్టుకోవడంలో ఎందుకు చూపడం లేదని ఆయన నిలదీశారు. ప్రభుత్వం మహిళల రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
