Advertisement

బీఎస్ఎన్ఎల్‌లో 100 జేటీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

మన పత్రిక, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 100 జూనియర్ టెలికాం ఆఫీసర్ (జేటీఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు జూన్ 4వ తేదీ నుంచి జూలై 3, 2026 వరకు బీఎస్ఎన్‌ఎల్ అధికారిక వెబ్‌సైట్ bsnl.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల్లో తప్పులను సరిదిద్దుకునేందుకు జులై 4 నుంచి 11 వరకు అవకాశం కల్పించారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు జులై 3 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. మూడు విభాగాలతో (ఇంజనీరింగ్ స్ట్రీమ్ 1 & 2, జనరల్ ఎబిలిటీ) కూడిన ఆబ్జెక్టివ్ తరహా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) మెరిట్ ఆధారంగా తుది ఎంపిక జాబితాను రూపొందిస్తారు. ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ. 16,400 నుంచి రూ. 40,500 వరకు జీతం, ఇతర అలవెన్సులు అందుతాయి.

Advertisement

దరఖాస్తు రుసుముగా యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 2,000, అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ. 1,000 చెల్లించాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా మాత్రమే ఫీజు చెల్లింపులకు అవకాశం ఉంటుంది.

Advertisement