మన పత్రిక, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సభ్యుల కోసం ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ నెల 29, 30వ తేదీల్లో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఈ క్రీడా సంబరాలు జరగనున్నాయి. నిరంతరం ప్రజా సమస్యలు, రాజకీయాలతో బిజీగా ఉండే ప్రజాప్రతినిధులకు మానసిక ఉల్లాసాన్ని అందించడంతో పాటు వారిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఉమ్మడి రాష్ట్రం నాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ప్రస్తుత శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్ పర్యవేక్షణలో ఈ పోటీలు నిర్వహించనున్నారు.29, 30 తేదీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పోటీలు
గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, టెన్నిస్‌తో పాటు అథ్లెటిక్స్ విభాగాల్లో పోటీలు ఉండనున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులందరూ ఈ క్రీడల్లో పాలుపంచుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే వేగవంతం చేశారు. క్రీడాకారులకు అవసరమైన కిట్లు, ట్రాక్ సూట్లు, వైద్య సదుపాయాలను సిద్ధం చేశారు. రాజకీయ విభేదాలకు అతీతంగా ప్రజాప్రతినిధులంతా మైదానంలో పోటీ పడనుండటం విశేషం.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
