Warangal Rains : కాకతీయుల రాజధాని ఓరుగల్లు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మునిగింది. వరంగల్ నగరం మొత్త కన్నీటి సంద్రం అయింది. దాదాపు 50 కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరంగల్ లో ఉన్న రెండు చెరువులు భద్రకాళి, వడ్డెపల్లి ఈ రెండు కూడా ఉప్పొంగిపోయాయి. చెరువుల నుంచి బయటికి వచ్చిన వరద నీరు మొత్తం కాలనీలను ముంచేసింది. హైదరాబాద్ తర్వాత అంతటి పేరు గాంచిన సిటీ ఇది. స్మార్ట్ సిటీగా డెవలప్ అవుతూ, ట్రై సిటీస్ గా పేరు గాంచిన వరంగల్ ఎందుకు ఇలా మునిగిపోయింది. ఒక్క రోజు కురిసిన వర్షానికే ఇలా వరంగల్ ఇలా ఎందుకు మునిగిపోయింది? అసలు కారణాలు ఏంటి?
వరంగల్ నగరం ఇలా వర్షాలకు మునిగిపోవడం ఇదే కొత్త కాదు. ఇది వరకు కూడా ఒకసారి వరంగల్ లో కురిసిన వర్షాలకు ట్రైసిటీలు మొత్తం మునిగిపోయాయి. గత నాలుగైదేళ్ల నుంచే ఇలా వరదలు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు నగర ప్రజలు. వర్షం వస్తే చాలు వరంగల్ నగరం భయపడుతోంది. వరంగల్ మున్సిపాలిటీ కాస్త గ్రేటర్ వరంగల్ గా మారింది కానీ, గ్రేటర్ వరంగల్ డెవలప్ మెంట్ మాత్రం ఎక్కడికక్కడే నిలిచింది అని చెప్పడానికి మొంథా తుపాను వల్ల కురిసిన వర్షమే దీనికి నిదర్శనం. ఇదివరకు 2016 లో ఒకసారి వరదలు ముంచెత్తగా, 2020, 2021 సమయంలో మరోసారి వరదలు ముంచెత్తాయి. మళ్లీ ఇప్పుడు మొంథా తుపాను వల్ల భారీ వర్షాలు వచ్చి నగరం మునిగింది.
వరంగల్, హన్మకొండ, కాజీపేట.. ఈ మూడు సిటీలు కలిపి 15 లక్షల వరకు జనాభా ఉంటుంది. రోజురోజుకూ జనాభా విస్తరిస్తోంది. హైదరాబాద్ తర్వాత అంతటి ఉపాధి దొరికేది ఇక్కడే. అందుకే ఇక్కడికి వలస వచ్చే జనాభా సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. కాకతీయుల కాలంలో నగరం చుట్టూ వందల కొద్దీ చెరువులు ఉండేవి. ఇప్పుడు ఆ చెరువులన్నీ కాలనీలుగా మారిపోయాయి. కాకతీయుల కాలంలో చెరువులను తవ్వించారు. గొలుసుకట్టు చెరువులను నిర్మించారు. ఒక చెరువు నిండగా మరో చెరువులోకి నీళ్లు వెళ్లేలా అప్పట్లో చెరువులను నిర్మించారు. ఇప్పుడు ఆ చెరువులన్నీ కాలనీలుగా అవతరించడంతో చిన్న వర్షానికే నీళ్లన్నీ కాలనీల్లోకి చేరుతున్నాయి. చెరువులను ఆక్రమించడం, కబ్జా చేయడం, చెరువుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి చాలామంది కోట్లు గడించారు కానీ, నగర ప్రజల పరిస్థితిని మాత్రం ఎవ్వరూ పట్టించుకోలేదు. నాలాల్లో పూడికతీత పనులు కూడా సరిగ్గా చేయకపోతే వర్షపు నీరు ఇలాగే కాలనీల్లోకి, రోడ్ల మీదికి వస్తుంది. ఇలా.. వరంగల్ నగరం మునిగిపోవడానికి ఒక్క కారణం కాదు.. పలు కారణాలు ఉన్నాయి. ఇప్పుడే కాదు.. మున్ముందు కూడా చిన్నపాటి వర్షం వచ్చినా వరంగల్ నగరం ఇలాగే మునిగిపోతుంది. ప్రజలు ఇలాగే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
