Advertisement

పశ్చిమ గోదావరి: పెళ్లైన మరుసటి రోజే పెళ్లి కొడుకు మృతి

AP CRIME: ఆ ఇంట్లో వివాహం జరిగి 24 గంటలు కూడా గడవలేదు.. పెళ్లికి కట్టిన మామిడి తోరణాలు ఇంకా పచ్చగానే ఉన్నాయి. ఇంతలోనే ఘోర రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచెత్తింది. బంధువులను బస్సు ఎక్కించి తిరిగొస్తుండగా అంబులెన్స్ ఢీకొని నవవరుడు, అతని స్నేహితుడు దుర్మరణం చెందిన ఘటన పెరవలి మండలంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

పోలీసుల కథనం ప్రకారం.. పిట్టల వేమవరానికి చెందిన నేలపూడి ప్రదీప్‌(24)కు అదే గ్రామానికి చెందిన యువతితో సోమవారం వివాహమైంది. బంధువులను సాగనంపేందుకు ప్రదీప్‌ తన స్నేహితుడు హరిదాసు బాలవీర సుబ్రహ్మణ్యసాయి(21)తో కలసి ద్విచక్రవాహనంపై జాతీయ రహదారి వద్దకు వెళ్లాడు. తిరిగొస్తుండగా పిట్టల వేమవరం కూడలి వద్ద అంబులెన్స్ వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ తణుకు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Advertisement

ప్రమాద సమయంలో హెల్మెట్ ధరించకపోవడమే ప్రాణాలు పోవడానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ప్రదీప్ ఇటీవలే బీటెక్ పూర్తి చేయగా, సాయి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. చేతికి వచ్చిన కుమారులు అనంత లోకాలకు వెళ్లడంతో కన్నవారు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement