Advertisement

వికారాబాద్: కుళ్లిపోయిన స్థితిలో రెండు మృతదేహాలు

TG CRIME: వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఐనెల్లి శివారులో రెండు మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో లభించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తీవ్ర దుర్వాసన రావడంతో అటుగా వెళ్లిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. మృతుల్లో ఒకరు పురుషుడు కాగా, మరొకరు మహిళగా గుర్తించారు.

అయితే మృతదేహాల వద్ద ఎటువంటి గుర్తింపు కార్డులు దొరకలేదని పోలీసులు తెలిపారు. అలాగే మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయి ఉండటంతో వారిని గుర్తించడానికి వీలు లేకుండా పోయిందని పేర్కొన్నారు. మృతులిద్దరూ భార్యాభర్తలా..? లేక ప్రేమికులా? అనే దానిపైనా స్పష్టత లేదని వెల్లడించారు. సంఘటన స్థలంలో పక్కనే రెండు పురుగుల మందు డబ్బాలు పడి ఉండటంతో ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

మృతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారా..? లేక ఎవరైనా హత్య చేసి మృతదేహాలను ఇక్కడ పడేశారా? వంటి కోణాల్లో పోలీసులు క్షుణ్నంగా దర్యాప్తు చేస్తున్నారు. ముందుగా వారి గుర్తింపు తెలుసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే వీరి మరణాలకు గల అసలు కారణాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. జంట మృతదేహాలు ఒకేచోట లభించడం స్థానికంగా సంచలనం సృష్టించింది.

Advertisement