మన పత్రిక: భాగ్యనగర వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కీలక హెచ్చరిక జారీ చేశారు. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనుల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయెల్ డెవిస్ వివరాలు వెల్లడించారు. వచ్చే ఆదివారం (ఏప్రిల్ 5) ట్రాఫిక్ డైవర్షన్ ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సుమారు మూడు గంటల పాటు వన్‌వే ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు.
పంజాగుట్ట నుంచి మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలు రోడ్ నెంబర్ 2లోకి మళ్లించి, అక్కడి నుంచి ఇందిరానగర్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5, రోడ్ నెంబర్ 10 మీదుగా రోడ్ నెంబర్ 45 చేరుకుని గమ్యస్థానానికి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే మాదాపూర్ నుంచి పంజాగుట్ట వైపు వచ్చే వాహనాలను జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మీదుగా కేబీఆర్ పార్క్ ముందు నుంచి వన్‌వేలో భాగంగా రోడ్ నెంబర్ 2 వైపు మళ్లిస్తారు. ఇక రోడ్ నెంబర్ 10, 12 ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను అగ్రసేన్ మహారాజ్ జంక్షన్, జర్నలిస్ట్ కాలనీ, బాలకృష్ణ నివాసం సమీపం మీదుగా జూబ్లీ చెక్‌పోస్ట్ ద్వారా కేబీఆర్ పార్క్ వైపు దారి మళ్లించనున్నారు. భవిష్యత్తులో ఇదే మార్గాన్ని శాశ్వతంగా అమలు చేసే యోచనలో అధికారులు ఉన్నారు.ఈ నేపథ్యంలో ట్రయల్ రన్‌ను ప్రజలు గమనించి, ట్రాఫిక్ సూచనలు పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
